సంక్రాంతి
'సంక్రాంతి'... అదో మధుర భావనా క్రాంతి
చలి మెత్తని పొత్తిళ్ళలో
నులివెచ్చని కలల కౌగిలింత,
అలసట చెందిన హృదయాలకు
సుందర మందహాస కిరణాలు పౌష్యపలకరింత
శ్రమ జీవన వాకిలిలో నూతనోత్సాహాల పులకరింత
అంబరాల సోయగాల - సంబరాల కేరింత
తెలతెల్లవారు సమయాన
తుషారాల తుళ్ళింతల మాటున
తెలిమంచు ముసుగులో
బసవన్నల మంగళ ధ్వనితో
రంగవల్లుల సింగారాల నడుమ
ముచ్చట గొలిపే గొబ్బెమ్మల
కన్నుల పండుగగా అలంకరిస్తూ
కరుణార్ద్రత నిండిన కళ్ళతో
తదేకంగా నావైపు చూస్తూ
నవ్వుతుంది, నవ్విస్తుంది...మళ్ళీ... మళ్ళీ
ఆ చల్లని చూపుల్లో, వెన్నెల నవ్వుల్లో
ఎంతటి అనురాగమో, ఎంతటి అభిమానమో
అందుకుని పొందిన ఆనంద పారవశ్యాన్ని
నా కళ్ళలో చూసి ఉప్పొంగిపోతుంది.................................
© 2017,www.logili.com All Rights Reserved.