Customer Reviews - Gandikota


Average Rating :  :  


on 12.04.2017 0 0

చీకటి చరిత్రకు వెలుగుబాట-'గండికోట' గ్రంథం! ప్రముఖ కథారచయిత, చరిత్ర పరిశోధకుడు తవ్వా ఓబుల్‌ రెడ్డి రచించిన 'గండికోట' గ్రంథం వెయ్యేళ్ల చీకటి పొరల్లో దాగిఉన్న ఆసక్తికర చరిత్రకు వెలుగుబాట గా నిలుస్తూ పర్యాటకుల్లో, చరిత్రపరిశోధకుల్లో చర్చనీయాంశంగా నిలుస్తోంది. కడప జిల్లా మైదుకూరుకు చెందిన రచయిత, సీనియర్‌ జర్నలిస్టు తవ్వా ఓబుల్‌ రెడ్డి ఇటీవలనే గండికోట పుస్తకానికి మూడవ ముద్రణ వెలువరించారు. ' ఏ యుధ్ధం ఎందుకు జరిగెనో..ఏ రాజ్యం ఎన్నాళ్లుందో..ఇవి కావోయ్‌ చరిత్రకు అర్థం..ఇతిహాసపు చీకటికోణం అట్టడుగున పడికాన్పించని కథలన్నీ కావాలిప్పుడు దాచేస్తే దాగని సత్యం' అని మహాకవి శ్రీశ్రీ చెప్పిన అక్షర సత్యాలు ఈ గండికోట పుస్తక విశిష్టతకు తార్కాణంగా నిలుస్తాయి. గండికోట చరిత్రనూ, ఆ చరిత్రలో దాగిన అనేక ఐతిహ్యాలనూ, ఆసక్తికర కథనాలనూ చారిత్రక పర్యాటక విశేషాలనూ తవ్వా ఓబుల్‌ రెడ్డి ఈ పుస్తకంలో పొందుపరిచారు. ఆనాటి గండికోట పాలకుల వారసుల నేటి ఆచూకీని వెల్లడించడంతో పర్యాటకులకూ, చరిత్రకారులకు ఈ పుస్తకం ఒక కరదీపికగా నిలుస్తోంది. కడపజిల్లా చరిత్రలో తనకంటూ విశిష్టతను చాటుకుంటూ దక్షిణ భారతదేశంలోనే విలక్షణమైన గిరిదుర్గంగా, జలదుర్గంగా పేరుగాంచిన గండికోట విజయనగర సామ్రాజ్యంలో సైనిక, పాలనా వ్యూహాలకు వేదికగా నిలిచింది. పెన్నానది ఒడ్డున ఎర్రమల పర్వతసానువుల్లో శత్రుదుర్భేద్యంగా నిర్మించబడిన గండికోట గురించి ఈ పుస్తకంలో ఆసక్తికర అధ్యాయాలు ఉన్నాయి. గండికోటకు పాలకులుగా పెమ్మసాని వారి వివరాలు, వారి పోరాట పటిమ, మీర్‌జుమ్లా కుట్ర, పెమ్మసానివారి వారసులైన కురివికులం జమీందారులతో పాటుగా గండికోట యుద్ధం తర్వాత తమిళనాడుకు వలసవెళ్లి అక్కడ కావేటిరాజపురం, కోయంబత్తూరు, కోవిల్‌పట్టి తదితర ప్రాంతాల్లో నేటికీ జీవిస్తున్న గండికోట వారసులను రచయిత ఓబుల్‌రెడి ్డ ఈ పుస్తకం ద్వారా వెలుగులోకి తీసుకురావడం విశేషం! అలాగే మూడవ ముద్రణలో అదనంగా గండికోట పాలకులైన నంద్యాల వంశీయుల వివరాలను సమగ్రంగా అందించడం పుస్తకానికి అదనవు విశిష్టతను చేకూర్చినట్లైంది. గండికోట రాజ్యంలో చెలామణిలో ఉన్న నాణేల వివరాలను, పెమ్మసాని రాజవంశీకుల రాజబంధువుల జాబితాను తాజా ముద్రణలో చేర్చడం అభినందనీయం. రెండు వందల ఏళ్లనాటి గండికోట రూపురేఖలపై పాశ్చాత్యులు చిత్రించిన వర్ణచిత్రాలు, కొత్త కోణాలను ఆవిష్కరించిన ఫోటోలు, కోట మ్యాపు ఈ పుస్తకానికి అదనపు ఆకర్షణను చేకూరుస్తున్నాయి. ప్రముఖ రచయిత, కేంద్రసాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత ఆచార్య కేతు విశ్వనాథరెడ్డి, సిపిబ్రౌన్‌ గ్రంథాలయం వ్యవస్థాపక కార్యదర్శి డాక్టర్‌ జానుమద్ది హనుమచ్చాస్త్రి లు ఈ పుస్తకానికి రాసిన ముందుమాటలు ఈ పుస్తకం ఔన్నత్యాన్ని ఇనుమడింపచేస్తున్నాయి.చరిత్ర పరిశోధకులకు, పర్యాటక ప్రేమికులను ఈ పుస్తకం ఎంతగానో అలరిస్తుందనడంలో సందేహం లేదు. -టి.మహానందప్ప


Powered by infibeam